: మూడు శతాబ్దాల నిబంధనలకు చరమగీతం...త్రయంబకేశ్వరుడి సన్నిధిలో మహిళలు!
మహారాష్ట్రలోని ప్రధాన జ్యోతిర్లింగ కేంద్రమైన నాసికా త్రయంబకంలో మూడు వందల సంవత్సరాల నుంచి అమలవుతున్న నిబంధనలను కూకటివేళ్లతో పెకిలించడంలో భూమాతా బ్రిగేడ్ విజయం సాధించింది. మహిళలకు ప్రవేశం లేని త్రయంబకేశ్వరుడి సన్నిధికి స్వరాజ్ సంఘ్ మహిళా కార్యకర్తలు వెళ్లి, అర్ధనారీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు సమావేశమైన ఆలయ పెద్దలు హైకోర్టు తీర్పు మేరకు మహిళలను అనుమతిస్తామని తెలిపారు. కాగా, గర్భగుడిలోకి ప్రవేశించాలన్న మహిళల నిర్ణయాన్ని అక్కడి స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ, బంద్ కు పిలుపునిచ్చారు. దీంతో అక్కడి దుకాణాలన్నీ స్వచ్ఛందంగా మూతపడ్డాయి. గుడిలోకి వెళ్లి వచ్చిన అనంతరం, తమ తదుపరి లక్ష్యం ముంబైలోని హజ్ అలీ దర్గా అని, అక్కడికి కూడా వెళ్లి ప్రార్థనలు జరుపుతామని మహిళలు స్పష్టం చేయడం గమనార్హం. నిన్న ఇదే దేవాలయంలోకి వెళ్లేందుకు యత్నించిన ఓ మహిళను అక్కడి భక్తులు అడ్డుకోవడంతో గాయాలపాలై ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.