: ఎంగిలి మెతుకులు మాకెందుకు?... బొబ్బిలి బ్రదర్స్ తొందరపడ్డారు: కురుపాం ఎమ్మెల్యే భర్త పరీక్షిత్ రాజు
తెలుగుదేశం నేతలు ఆశ చూపే పదవులు, డబ్బులకు లొంగిపోయే వాళ్లం కాదని విజయనగరం జిల్లా కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి భర్త శత్రుచర్ల పరీక్షిత్ రాజు వ్యాఖ్యానించారు. బొబ్బిలి సోదరులు తెలుగుదేశం పార్టీలో చేరిన సమయంలో పుష్పశ్రీవాణి సైతం వైకాపా నుంచి ఫిరాయించనున్నారంటూ వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు. ఎంగిలి మెతుకులకు తాము కక్కుర్తి పడబోమని అన్నారు. వైకాపా అధినేత జగన్ వెంటే తన కుటుంబం, కార్యకర్తలు ఉంటారని స్పష్టం చేశారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని, ఓ పార్టీ గుర్తుపై గెలిచి, మరో పార్టీలో చేరిపోవడం దారుణమని అన్నారు. అధికారంలో ఉన్న పార్టీలోకి విపక్ష సభ్యులు వెళ్లిపోతే, ప్రజాస్వామ్యానికే అర్థం ఉండదని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పూటకో అబద్ధం చెబుతున్నారని, నిత్యమూ మాట మారుస్తున్నారని, ఆయన మాటల్ని నమ్మే పరిస్థితి లేదని విమర్శలు గుప్పించారు. సుజయకృష్ణ రంగారావు, బేబీ నాయన తనకు సన్నిహితులని, వారు పార్టీ మారడంతో తాను బాధపడ్డానని తెలిపారు. వారు తొందరపడి తెలుగుదేశంలో చేరినట్టు భావిస్తున్నానని, భవిష్యత్తు వైకాపాదేనని వివరించారు.