: అమరావతిలో కల్తీ మద్యం కలకలం!... బెల్టు షాపులోని మద్యం తాగి ఇద్దరి దుర్మరణం
ఏపీలో మరోమారు కల్తీ మద్యం కరాళ నృత్యం చేసింది. ఇప్పటికే విజయవాడలోని కృష్ణలంక పరిధిలో ఏర్పాటైన స్వర్ణ బార్ లో కల్తీ మద్యం సేవించిన ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందగా, 25 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో స్వర్ణ బార్ యజమానిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఆయన సోదరుడు జైలుకు కూడా వెళ్లి వచ్చారు. తాజాగా కొద్దిసేపటి క్రితం నవ్యాంధ్ర నూతన రాజధానికి కేంద్ర బిందువుగా మారిన గుంటూరు జిల్లాలో కల్తీ మద్యం ఇద్దరిని పొట్టనబెట్టుకుంది. జిల్లాలోని అమరావతి మండలం మునుగోడులోని ఓ బెల్టు షాపులో మద్యం కొనుగోలు చేసి సేవించిన ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. మరణించిన వారిని నీలయ్య, కాటంరాజులుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.