: 'రిగ్గింగ్'పై తృణమూల్, సీపీఎం ఘర్షణ, ఒకరి మృతి... లక్షమంది పోలీసులున్నా ఆగని హింస
మూడోదశ ఎన్నికలు జరుగుతున్న వేళ, పశ్చిమ బెంగాల్ లోని ముర్షిదాబాద్ జిల్లాలో తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణలు చెలరేగగా, ఒక వ్యక్తి మరణించాడు. దోమ్ కోల్ ప్రాంతంలో జరిగిన ఘర్షణలో సీపీఎం పార్టీకి చెందిన ఎన్నికల ఏజంటును ప్రత్యర్థులు తుపాకితో కాల్చి చంపారు. తమ రిగ్గింగ్ కు సహకరించడం లేదన్న కారణంతో, గుర్తు తెలియని తృణమూల్ కార్యకర్త ఒకరు ఇతన్ని కాల్చి చంపినట్టు తెలుస్తోంది. అత్యంత సమస్యాత్మకమైన ఈ జిల్లాలో దాదాపు లక్ష మంది పోలీసులను ఎన్నికల భద్రత నిమిత్తం నియమించినప్పటికీ, పలు చోట్ల రిగ్గింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఒక పార్టీపై మరో పార్టీ ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. ఈ ఉదయం 7 గంటలకు మొత్తం 16 వేలకు పైగా పోలింగ్ సెంటర్లలో పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకూ సాగనున్న పోలింగ్ లో 1.37 కోట్ల మందికి పైగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.