: ఏపీ సీఎంగా 2050 దాకా చంద్రబాబే!... అదృష్టముంటే ప్రధాని కూడా!: ముద్దుకృష్ణమ జోస్యం
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుతం ఏపీ శాసనమండలిలో ఎమ్మెల్సీగా కొనసాగుతున్న గాలి ముద్దుకృష్ణమనాయుడు నిన్న ఆసక్తికర జోస్యం చెప్పారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని నిన్న హైదరాబాదులోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరిగిన వేడుకల్లో ముద్దుకృష్ణమ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... ఏపీకి ముఖ్యమంత్రిగా చంద్రబాబు 2050 దాకా కొనసాగుతారని జోస్యం చెప్పారు. అదృష్ణముంటే ప్రధానమంత్రి పీఠాన్ని కూడా చంద్రబాబు అధిరోహిస్తారని కూడా ఆయన పేర్కొన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రికీ లేని రాజకీయ అనుభవం, పరిచయాలు చంద్రబాబు సొంతమని ముద్దుకృష్ణమ అన్నారు. తెలంగాణకు నిజమైన స్వాతంత్య్రం ఇచ్చింది ఎన్టీఆర్, చంద్రబాబేనని కూడా ఆయన పేర్కొన్నారు.