: చంద్రబాబుకు బర్త్ డే గ్రీటింగ్స్ చెప్పేందుకు... మండుటెండలో కాలిబాట పట్టిన మంత్రి కొల్లు!
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పేందుకు మంత్రి కొల్లు రవీంద్ర మండుటెండలో కాల బాట పట్టారు. విజయవాడలో నిన్న చోటుచేసుకున్న ఈ ఆసక్తికర ఘటన వివరాల్లోకెళితే... నిన్న చంద్రబాబు బర్త్ డే సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పేందుకు మంత్రి కొల్లు రవీంద్ర విజయవాడలోని లింగమనేని గెస్ట్ హౌస్ కు బయలుదేరారు. అప్పటికే చంద్రబాబు తన క్యాంపు కార్యాలయానికి బయలుదేరిపోయారు. సీఎం కాన్వాయ్ బయటకు వచ్చిన నేపథ్యంలో అల్లంత దూరాన మంత్రి కాన్వాయ్ ను పోలీసులు నిలిపేశారు. ఏదేమైనా తమ ప్రియతమ నేత చంద్రబాబుకు బర్త్ డే విషెస్ తెలపాల్సిందేనన్న తలంపుతో కొల్లు కారు దిగి మండుటెండలోనే కాలినడకన లింగమనేని గెస్ట్ హౌస్ కు బయలుదేరారు. కొద్దిదూరం నడవగానే సీఎం కాన్వాయ్ ఆయనను దాటి వెళ్లిపోతోంది. ఈ క్రమంలో కాలినడకన తన వద్దకు వస్తున్న కొల్లును చూసిన చంద్రబాబు.. తన కారును ఆపమని ఆదేశించారు. తన వద్ద సీఎం కారు ఆగగానే కొల్లు తన చేతిలోని బొకేను చంద్రబాబుకు అందజేసి బర్త్ డే విషెస్ చెప్పారు. ఆ తర్వాత చంద్రబాబు కాన్వాయ్ వెళ్లిపోగా, కొల్లు తిరిగి తన కారు నిలిచిన వద్దకు మళ్లీ కాలినడకననే వెళ్లి కారెక్కారు.