: డాక్టర్ అవతారమెత్తిన భువనగిరి ఎంపీ!... ఊబకాయుడికి ఆపరేషన్ చేసిన వైనం
టీఆర్ఎస్ నేత, భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఇటీవల డాక్టర్ అవతారం ఎత్తారు. ఓ ఊబకాయుడికి దిగ్విజయంగా శస్త్రచికిత్స చేశారు. వైద్యుడి అవతారం ఎత్తడానికి ఇదేమైనా సినిమానా?... ఎంపీగారు ఆపరేషన్ ను సక్సెస్ ఫుల్ గా చేయడమేమిటనేగా, మీ అనుమానం? కాస్తంత వెనక్కు వెళితే... అసలు విషయం అర్థమమవుతుంది. రాజకీయాల్లోకి రాకముందు నర్సయ్య గౌడ్ వైద్యుడు. వైద్యుడంటే మామూలు వైద్యుడు కాదు... చేయి తిరిగిన వైద్యుడు. ల్యాప్రోస్కోపీ శస్త్రచికిత్సలో దేశంలోని అగ్రగణ్యుల్లో ఆయన కూడా ఒకరు. 1989లోనే కేంద్రం ప్రభుత్వం నుంచి ఆయన ‘స్పెషల్ సర్జికల్ స్కిల్స్’ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాతి ఏడాది (1990)లోనూ ఆయన ‘బెస్ట్ సర్జన్’గానూ అవార్డు తీసుకున్నారు. ఈ క్రమంలో స్టార్ ఆసుపత్రితో అప్పుడప్పుడు టచ్ లో ఉంటున్న నర్సయ్య గౌడ్... ఊబకాయంతో బాధపడుతున్న హైదరాబాదుకు చెందిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ వ్యాపారికి ఆపరేషన్ చేసేందుకు ఒప్పుకున్నారు. ఈ క్రమంలో ఇటీవలే ఆపరేషన్ విజయవంతమైంది. నిన్న పేషంట్ తో కలిసి నర్సయ్య గౌడ్ మీడియా ఎదుట ప్రత్యక్షమయ్యారు. ఆపరేషన్ ను ఎలా చేసింది సవివరంగా తెలిపారు. రాజకీయాల్లో బిజీబిజీగా ఉన్నా... తన వృత్తిని మాత్రం ఆయన వీడకపోవడం గమనార్హం.