: స్పీకర్ సెక్యూరిటీ అధికారి రాసలీలలు!... గ్రామస్థుల దాడితో నగ్నంగా పరుగులు!


తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారికి సెక్యూరిటీ అధికారిగా పనిచేస్తున్న ఓ పోలీసు అధికారి దారి తప్పాడు. వీవీఐపీ కేటగిరిలో ఉన్న మధుసూదనాచారికి భద్రత కల్పించే కీలక బాధ్యతలను పక్కనపెట్టేసి ఓ మహిళతో రాసలీలల్లో మునిగిపోయాడు. అయితే మహిళ తరఫు బంధువులు దాడికి దిగడంతో అతడు నగ్నంగా నడిరోడ్డుపై పరుగులు పెట్టాడు. చివరికి పోలీసులు అతడిని రక్షించి, గుడ్డలు అందించి పంపారు. మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత వరంగల్ జిల్లా భూపాలపల్లిలోని రాజీవ్ నగర్ కాలనీ స్పీకర్ క్యాంపు కార్యాలయం సమీపంలో జరిగిన ఈ ఘటన వరంగల్ జిల్లాలో హాట్ టాపిక్ లా మారిపోయింది. వివరాల్లోకెళితే... మధుసూదనాచారి భూపాలపల్లి నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత ఆయన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆయనకు ప్రభుత్వం వీవీఐపీ కేటగిరి భద్రతను కల్పించింది. ప్రత్యేకించి భూపాలపల్లి పరిసరాల్లో ఇటీవల నిషేధిత మావోయిస్టుల కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆయనకు కేటాయించిన సెక్యూరిటీ సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిందే. అయితే వీవీఐపీకి భద్రత కల్పించే గురుతర బాధ్యతను మరిచిన ఓ సెక్యూరిటీ అధికారి... స్పీకర్ వద్దకు ఏదో పని నిమిత్తం వచ్చిన మహిళతో చాలా కాలం క్రితమే పరిచయం పెంచుకున్నాడు. సదరు పరిచయాన్ని అతడు వివాహేతర బంధంగా మార్చుకున్నాడు. మధుసూదనాచారి ఎప్పుడు భూపాలపల్లి వెళ్లినా... సదరు భద్రతాధికారి స్పీకర్ కు భద్రత కల్పించే విషయాన్ని పక్కనబెట్టి మహిళ ఇంటికి వెళ్లి రాసలీలల్లో మునిగిపోయేవాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం మధుసూదనాచారి భూపాలపల్లి వెళ్లగా, ఆయనకు భద్రతగా అక్కడికి వెళ్లిన సదరు భద్రతాధికారి రాత్రి కాగానే విధులకు డుమ్మా కొట్టేసి... నేరుగా ఆ మహిళ ఇంటిలోకి దూరిపోయాడు. లోపల గొళ్లెం పెట్టుకుని రాసలీలల్లో మునిగిపోయాడు. అప్పటికే సదరు అధికారి వ్యవహారంపై ఆగ్రహంగా ఉన్న మహిళ తరఫు బంధువులు కాపు కాసి... దాడికి దిగారు. దీంతో బిత్తరపోయిన సదరు అధికారి గుడ్డలు లేకుండానే ఇంటి బయటకొచ్చేసి నడిరోడ్డుపై నగ్నంగా పరుగులు పెట్టాడు. ఈ క్రమంలో అక్కడ పెట్రోలింగ్ కు వచ్చిన పోలీసులకు తారసపడ్డాడు. వారు అతడిని అదుపులోకి తీసుకునే క్రమంలో తాను స్పీకర్ సెక్యూరిటీ అధికారినని చెప్పాడు. దీంతో పోలీసులు అతడికి దుస్తులు సమకూర్చి... పోలీసు బాసులకు సమాచారం చేరవేశారు. బాసుల ఆదేశాల మేరకు అతడిని పోలీసులు ఆ తర్వాత వదిలేశారు.

  • Loading...

More Telugu News