: చెక్ బౌన్స్ కేసులో విజయ్ మాల్యా దోషే!... తేల్చేసిన ఎర్రమంజిల్ కోర్టు


బ్యాంకులకు కోట్లాది రూపాయల రుణాలను ఎగవేసి లండన్ చెక్కేసిన విజయ్ మాల్యా... వరుసగా చిక్కుల్లో ఇరుక్కుంటున్నారు. మాల్యాను దేశానికి తిరిగి రప్పించడమే లక్ష్యంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నడుం బిగించింది. ఇందుకోసం ఏకంగా ఇంటర్ పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించేందుకు ఈడీ సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో నిన్న హైదరాబాదులోని ఎర్రమంజిల్ కోర్టు మాల్యాకు షాకిచ్చింది. జీఎంఆర్ కు కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయిన కేసులో మాల్యాను కోర్టు దోషిగా తేల్చింది. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానాలను జీఎంఆర్ ఆధ్వర్యంలోని శంషాబాదు ఎయిర్ పోర్టులో పార్కింగ్ చేసినందుకు గాను మాల్యా రూ.22 కోట్ల మేర బకాయి పడ్డారు. ఈ మొత్తానికి మాల్యా సంస్థ ఇచ్చిన చెక్కులు బౌన్సయ్యాయి. దీనిపై జీఎంఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ఎర్రమంజిల్ కోర్టు ఇరు పక్షాల వాదనను విన్నది. వాదనలు ముగిసినట్లు నిన్న ప్రకటించింది. అంతేకాక ఈ వ్యవహారంలో మాల్యాను కోర్టు దోషిగా పేర్కొంది. అయితే శిక్ష ఖరారును వచ్చే నెల 5కు వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News