: త్రయంబకేశ్వరంలో పురోహితులపై మహిళా కార్యకర్తల ఫిర్యాదు
ప్రముఖ శైవ క్షేత్రమైన త్రయంబకేశ్వరం గర్భగుడిలోకి మహిళా కార్యకర్తలను వెళ్లనీయకుండా స్థానిక పురోహితులు అడ్డుకున్నారనే ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి అక్కడి పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టరు హెచ్ పీ కోల్హా మాట్లాడుతూ, బాధితుల ఆరోపణల మేరకు త్రయంబకేశ్వరం మున్సిపల్ కౌన్సిల్ మాజీ అధ్యక్షుడు అనఘా ఫాద్కే సహా 200 మంది వ్యక్తులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. ఆలయంలోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, పూణెకు చెందిన స్వరాజ్ సంఘటన అనే స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు వనతా గుత్తే మాట్లాడుతూ, తాను, తమ సంస్థకు చెందిన మహిళా కార్యకర్తలతో కలిసి ఈరోజు ఉదయం 5 గంటలకు గర్భగుడిలోకి వెళ్లే క్యూలో నిలబడ్డామన్నారు. ఆలయ నిబంధనల మేరకు డ్రెస్ కోడ్ పాటించామన్నారు. అయితే, క్యూలో నిలబడ్డ తమ ముందుకు స్థానిక పురోహితులు, మహిళలు వచ్చి నిలబడ్డారని, తమను లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారని, తమపై చేయి చేసుకున్నారని ఆమె ఆరోపించింది. అనంతరం, పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఈమేరకు ఫిర్యాదు చేశామని చెప్పారు.