: మోదీ సర్కారు సహకరించాల్సిందే: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అన్ని హామీలనూ నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుదేనని, మిగతా అన్ని రాష్ట్రాలతో సమానంగా ఏపీ అభివృద్ధి చెందే వరకూ సహకరించాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. కొద్దిసేపటి క్రితం విజయనగరం వైకాపా నేతలు సుజయకృష్ణ రంగారావు, బేబీ నాయన తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంగా ఆయన ప్రసంగించారు. విజయనగరం నుంచి ప్రజల వలసలు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. బొబ్బిలి పరిసర ప్రాంతాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని, తాము ఎవరినీ తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించలేదని స్పష్టం చేశారు. పేదల సంక్షేమానికి పెద్ద పీట వేస్తామని, ఎక్కడా రాజీ పడబోమని అన్నారు. రాష్ట్రాభివృద్ధి విషయమై కేంద్రంతో ఎన్నోమార్లు చర్చించామని చంద్రబాబు తెలిపారు. ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాల్సి వుందని సూచించారు. తాను ఎల్లప్పుడూ విజయనగరం జిల్లాను అభిమానిస్తుంటానని, సుజయకృష్ణ, బేబీ నాయనల చేరిక తనకెంతో సంతోషాన్ని కలిగిస్తోందని వివరించారు. విజయనగరం జిల్లాకు త్వరలో అంతర్జాతీయ విమానాశ్రయం రానుందని, ఆపై విశాఖపట్నం, విజయనగరాలు కలిసిపోతాయని అన్నారు.