: నా వ్యాఖ్యలు అంధుల మనసులు గాయపరిచుంటే చింతిస్తున్నా: ఆర్బీఐ గవర్నర్
'గుడ్డివాళ్ల రాజ్యంలో ఒంటికన్ను వాడే రాజు' అన్న తన వ్యాఖ్యలు అంధుల మనసును గాయపరిచి వుంటే, అందుకు తాను చింతిస్తున్నానని ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ వ్యాఖ్యానించారు. మిగతా దేశాలతో పోలిస్తే ఇండియా మెరుగైన పనితీరుతో ముందు నిలిచిందని చెప్పడానికే తాను ఆ సామెతను వాడానని చెప్పారు. పుణెలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్ మెంట్ 12వ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు. ఇండియాలో అద్భుత రీతిన వృద్ధి లేదని, ఇదే సమయంలో చాలా దేశాలకన్నా దూసుకెళుతోందని చెప్పడమే తన ఉద్దేశమని తెలిపారు. తాను వాడిన సామెతలోని అసలు అర్థాన్ని చూడకుండా, పెడార్థాన్ని తీసేందుకే మీడియా యత్నించిందని ఆయన ఆరోపించారు. తన వ్యాఖ్య ఎవరిని బాధించినా, తనను క్షమించాలని అన్నారు.