: త్రయంబకేశ్వర ఆలయంలో ఉద్రిక్తత.. సొమ్మసిల్లి పడిపోయిన మహిళ
లింగ సమానత్వంపై పోరాడుతూ దేశవ్యాప్తంగా పలువురు మహిళలు ఉద్యమిస్తున్న వేళ మరోసారి వారికి చేదు అనుభవం ఎదురైంది. ఈరోజు త్రయంబకేశ్వర ఆలయంలోకి ప్రవేశించాలని చూసిన మహిళలను ఆలయ పూజారులు మరోసారి అడ్డుకున్నారు. దీంతో త్రయంబకేశ్వర ఆలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆలయ సిబ్బంది, మహిళలకు మధ్య జరిగిన వాగ్వివాదంలో ఓ మహిళపై దాడి జరిగింది. దీంతో సొమ్మసిల్లి పడిపోయిన మహిళను అధికారులు ఆసుపత్రికి తరలించారు. మరోవైపు తడిబట్టలతోనే గర్భగుడిలోనికి రావాలంటూ మహిళలపై ఆంక్షలు విధించినట్లు సమాచారం. దేవాలయ ట్రస్ట్ విధించిన నిబంధనను మహిళా కార్యకర్తలు తిరస్కరించడంతో వారిని ఆలయంలోనికి ప్రవేశించకుండా అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై మహిళా సాధికారత ఉద్యమ కారులు మండిపడుతున్నారు. మహిళలను దేవాలయాల్లోకి అనుమతించాలని ఆదేశాలు జారీ అయినా దేవాలయాల సిబ్బంది మహిళలను అడ్డుకుంటున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.