: కంప్యూటర్ అమ్మకాలు లేవంటూ, 12 వేల మందిని తొలగిస్తున్న ఇంటెల్!
స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు రాజ్యమేలుతున్న వేళ, కంప్యూటర్ల అమ్మకాలు గణనీయంగా పడిపోతుండగా, నంబర్ వన్ చిప్ మేకర్ గా, కంప్యూటర్ల తయారీ సంస్థగా నిలిచి సేవలందించిన ఇంటెల్, ప్రపంచవ్యాప్తంగా 12 వేల మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. మొత్తం ఉద్యోగుల్లో ఈ సంఖ్య 11 శాతానికి సమానం. భవిష్యత్తులో డేటా సెంటర్లు, ఇంటర్నెట్ ఆధారిత పరికరాలకు మైక్రో చిప్ లను తయారు చేసే విభాగంపై మరింత దృష్టిని సారించనున్నామని సంస్థ వెల్లడించింది. తగ్గిన కంప్యూటర్ అమ్మకాలు ఇప్పటికే హెల్వెట్ పాకార్డ్ (హెచ్పీ) సంస్థతో పాటు మైక్రోసాఫ్ట్ ను కుదేలు చేయగా, హెచ్పీ ఏకంగా రెండు వేర్వేరు సంస్థలుగా విడిపోయిన సంగతి తెలిసిందే. మైక్రోసాఫ్ట్ సైతం కంప్యూటర్లను వదిలి మెరుగైన స్మార్ట్ ఫోన్ల రంగం వైపు అడుగులు వేసింది. కొత్త టెక్నాలజీ యూజర్లంతా కంప్యూటర్లను వదిలి, తమ అవసరాలను తీర్చుకునేందుకు డెస్క్ టాప్ మోడళ్లుగా పేరుబడ్డ టాబ్లెట్ల వైపు నడుస్తున్నారు. ఆ కారణంగానే ప్రపంచంలోనే అతిపెద్ద చిప్ తయారీ సంస్థగా ఉన్న ఇంటెల్, ఈ సంవత్సరం ఆదాయం తగ్గుతుందని గతంలోనే ప్రకటించింది. ఈ సంవత్సరం జనవరి - మార్చి మధ్య కాలంలో కంప్యూటర్ల అమ్మకాలు 11.5 శాతం తగ్గాయని గ్లోబల్ రీసెర్చ్ సంస్థ ఐడీసీ వెల్లడించింది. ఇదే సమయంలో ఇంటెల్ లో ఉద్యోగాల కోత వార్తలు సంస్థ ఈక్విటీ విలువను 2.2 శాతం దిగజార్చాయి. ఉద్యోగుల తొలగింపు ద్వారా సంవత్సరానికి 1.4 బిలియన్ డాలర్లను ఆదా చేయవచ్చన్నది ఇంటెల్ ఆలోచనగా తెలుస్తోంది.