: పాలేరు ఎన్నిక ఏకగ్రీవం కావాల్సిందే!... లేదంటే టీఆర్ఎస్ పై ‘ఉమ్మడి’ పోరేనంటున్న భట్టి
తెలంగాణ ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ రాంరెడ్డి వెంకటరెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికకు సంబంధించి నిన్న కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క నేటి ఉదయం హైదరాబాదులో కీలక వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా పదవిలో ఉండగా చనిపోయిన ప్రజా ప్రతినిధుల స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో చనిపోయిన నేత కుటుంబానికి చెందిన కుటుంబ సభ్యుల్లోని ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నుకునే సంప్రదాయం ఉంది. అయితే మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డి మృతితో జరిగిన ఉప ఎన్నికలో ఈ సంప్రదాయానికి టీఆర్ఎస్ చెల్లుచీటి ఇచ్చింది. ఈ క్రమంలో మల్లు భట్టి విక్రమార్క చేసిన ప్రకటన పెద్ద చర్చకే తెర తీసేలా ఉంది. రాంరెడ్డి వెంకటరెడ్డి మరణంతో ఖాళీ అయిన పాలేరు నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలను ఏకగ్రీవంగా ముగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో తాము అధికార టీఆర్ఎస్ తో చర్చిస్తామని ఆయన తెలిపారు. ఏకగ్రీవానికి టీఆర్ఎస్ ఒప్పుకుంటే సరేసరి... లేదంటే విపక్షాలన్నింటినీ ఒక్కదరికి చేర్చి అధికార పార్టీపై ఉమ్మడి పోరుకు దిగుతామని ఆయన ప్రకటించారు.