: న్యూయార్క్ ప్రైమరీలో సత్తా చాటిన హిల్లరీ, ట్రంప్
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగే అభ్యర్థుల రేసులో హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ దూసుకెళుతున్నారు. అమెరికాలోని ప్రధాన రాజకీయ పార్టీ డెమొక్రటిక్ పార్టీ తరఫున బరిలోకి దిగేందుకు ఆ దేశ మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ సతీమణి, ఆ దేశ మాజీ విదేశాంగ శాఖ మంత్రి హిల్లరీ క్లింటన్ ఉవ్విళ్లూరుతున్నారు. ఇక రిపబ్లికన్ పార్టీ తరఫున ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి డొనాల్డ్ ట్రంప్ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగంలోకి దిగారు. ఇప్పటిదాకా జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో అటు హిల్లరీతో పాటు ఇటు ట్రంప్ కూడా తమ ప్రత్యర్థుల కంటే మెరుగైన ఫలితాలు సాధించారు. ఇక కీలకమైన న్యూయార్క్ ప్రైమరీకి కొద్దిసేపటి క్రితం ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థిగా హిల్లరీ విజయం సాధించగా, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ సత్తా చాటారు. ఈ ఫలితాలతో అమెరికా అధ్యక్ష బరిలోకి దిగే అభ్యర్థులుగా వీరు మరో ముందడుగు వేసినట్లైంది.