: భీమవరంలో విషాదం!... కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారుల మృతి


పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నిన్న రాత్రి విషాదం చోటుచేసుకుంది. పార్క్ చేసి ఉన్న కారులోకి ఆడుకునేందుకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు ఊపిరాడక చనిపోయారు. పట్టణంలోని బ్యాంకు కాలనీకి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఈశ్వరి (6), లక్ష్మీదుర్గ (4) మరో బాలికతో కలిసి తమ అమ్మమ్మ ఇంటివద్ద ఆడుకునే క్రమంలో ఇంటి బయట ఉన్న కారును ఎక్కారు. ఈ క్రమంలో వారు కారులోకి వెళ్లిన తర్వాత కారు ఆటోమేటిక్ లాక్ ఆనైపోయింది. దీంతో బాలికలు కారులో ఉండగానే వారి ప్రమేయం లేకుండానే డోర్లు లాకయ్యాయి. మూసుకుపోయిన కారు డోర్లను తీసేందుకు బాలికలు చేసిన యత్నాలు ఫలించలేదు. ఇక పిల్లలు ఆడుకుంటున్నారన్న భావనతో వారి తల్లిదండ్రులు, బంధువులు అంతగా పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఊపిరాడక ఈశ్వరి, లక్ష్మీదుర్గలు కారులోనే చనిపోయారు. ఇంకా కొంతసేపుంటే వారితో కారులోకి వెళ్లిన బాలిక కూడా చనిపోయేదే. అయితే చాలా సేపటి నుంచి బాలికలు కనిపించకపోవడంతో వారి తల్లిదండ్రులు వెదుకులాడగా, ఈ ఘోరం వెలుగు చూసింది. కారు డోర్లను లాక్ చేసేసరికి ఈశ్వరి, లక్ష్మీదుర్గలు చనిపోగా, మరో బాలిక కొన ఊపిరితో ఉంది. ముగ్గురు బాలికలను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, ఈశ్వరి, లక్ష్మీదుర్గ చనిపోయారని వైద్యులు నిర్ధారించారు. కొనఊపిరితో ఉన్న బాలికకు చికిత్స ప్రారంభించారు.

  • Loading...

More Telugu News