: 200 అడుగుల లోపు కొత్త బోర్ వెల్స్ వేయవద్దు: ‘మహా’ సర్కార్ ఆదేశాలు
మహారాష్ట్రలో నెలకొన్న తీవ్రమైన నీటి కరవు నేపథ్యంలో అక్కడి సర్కార్ కొత్త నిర్ణయం తీసుకుంది. 200 అడుగుల లోపల కొత్త బోర్ వెల్స్ వేయడాన్ని నిషేధిస్తున్నట్లు ఆదేశించింది. ఈ సందర్భంగా మంచి నీటి సరఫరా, శానిటేషన్ మంత్రి బాబన్ రావ్ లోనికర్ మాట్లాడుతూ, ఈ విషయమై ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై మహారాష్ట్ర గ్రౌండ్ వాటర్, మేనేజ్ మెంట్ యాక్టు ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ యాక్టు ప్రకారం జరిమానా లేదా జైలు శిక్షపడే అవకాశముందన్నారు. రాష్ట్రంలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్న కారణంగా ఈ యాక్టును అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సీనియర్ అధికారులందరితో మాట్లాడిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఈ యాక్టును అమలు చేసేందుకు ప్రజల సహకారం కూడా తమకు కావాలని లోనికర్ కోరారు.