: పర్యాటకులూ జాగ్రత్త... నిన్న అమెరికా, నేడు జర్మనీ హెచ్చరికలు
రెండు రోజుల క్రితం అమెరికా తన దేశీయులను పర్యాటకం నిమిత్తం వివిధ దేశాలకు వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేసింది. తాజాగా జర్మనీ, ఇటలీ ఇంటెలిజెన్స్ విభాగం కూడా ఆ దేశస్థులకు హెచ్చరికలు జారీ చేసింది. విహార యాత్రల్లో భారీ ఎత్తున బాంబు దాడులు చేసేందుకు ఐఎస్ఐఎస్ ప్రణాళికలు రచించిందని తెలిపింది. సిరియా, ఇరాక్ లలో సంకీర్ణ సేనల ధాటికి తాళలేకపోతున్న ఐఎస్ఐఎస్ ఆఫ్రికా, బంగ్లాదేశ్ వంటి కొన్ని దేశాలకు విస్తరించింది. దీంతో ఇటాలియన్, ఫ్రెంచ్, స్పానిష్ పర్యాటకుల లక్ష్యంగా బీచ్ ఒడ్డులు, బీచ్ లలోని సన్ బెడ్ ల కింద బాంబులు అమర్చాలని; ఐస్ క్రీం, టీషర్టులు, స్నాక్స్ అమ్మేవారిగా నటిస్తూ ఆయా ప్రాంతాల్లో ఆత్మాహుతి దాడులకు సిద్ధంగా ఉండాలని టెర్రరిస్టు నేతలు తమ అనుచరులకు ఆదేశాలు ఇచ్చారని తెలుస్తోందని జర్మనీ, ఇటలీ వెల్లడించాయి. వీలు చూసుకుని, మెషీన్ గన్ లు ఉపయోగించి రక్తపాతం సృష్టించాలని తీవ్రవాదులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో, ప్రధానంగా ఆఫ్రికా దేశాలకు వెళ్లే పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని జర్మనీ ఆదేశాలు జారీ చేసింది. ఆఫ్రికాలోని బోకోహరమ్ తీవ్రవాద సంస్థతో ఐఎస్ఐఎస్ చేతులు కలపడంతో ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉంటుందని జర్మనీ, ఇటలీ ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు.