: అసభ్యంగా ప్రవర్తించినందుకు ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళ.. వెంటాడి కాల్పులు జరిపిన దుండగులు
అసభ్యంగా ప్రవర్తించినందుకు మందలించిన ఓ మహిళపై కొందరు దుండగులు కాల్పులు జరిపిన ఘటన ఢిల్లీ-గుర్గావ్ ఎక్స్ప్రెస్వేలో చోటు చేసుకుంది. ఇద్దరు మహిళలు సహా ఆరుగురు వ్యక్తులు ఓ స్కార్పియో కారులో ఢిల్లీ-గుర్గావ్ ఎక్స్ప్రెస్వేపై ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో ఓ మద్యం షాపు వద్ద ముగ్గురు వ్యక్తులు స్కార్పియోలో ఉన్న మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో కారులో ఉన్న మహిళల్లో ఒకరు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన ఆ ముగ్గురు వ్యక్తులు మరో ఇద్దరు వ్యక్తులను తీసుకొచ్చారు. కారులో తిరిగి అక్కడి నుంచి వెళ్తున్న వారిని వెంబడించి, కారు అద్దాలను పగలగొట్టారు. కారులోని ఇద్దరు వ్యక్తులపై కాల్పులు జరిపారు. ఘటనపై ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనకు పాల్పడ్డ వారి కోసం గాలిస్తున్నారు.