: జగన్ ఒంటరి కావడం ఖాయం... చివరకు బంధువులు కూడా తోడుండరు: మంత్రి ప్రత్తిపాటి
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరవైఏళ్ల వయస్సులో కూడా కష్టపడి పనిచేస్తున్నారని, రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడుతున్నారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మండుటెండల్లో సీఎం పర్యటిస్తుంటే వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఖాళీగా కూర్చుని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. జగన్ దృష్టి అంతా సీఎం కుర్చీపైనే ఉందని విమర్శించారు. సీఎం కుర్చీ కోసం పాకులాడే పార్టీ తమది కాదని అన్నారు. జగన్ ఒంటరి కావడం ఖాయమని, ఆఖరికి బంధువులు కూడా ఆయనకు తోడుగా ఉండరంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. నీటి ఎద్దడి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.200 కోట్లు మంజూరు చేయనుందన్నారు. వేసవిలో వడగాల్పుల బారిన పడకుండా ఉండేందుకని చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యంగా బస్టాండ్, రైల్వేస్టేషన్, రద్దీ కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వడగాల్పులపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని అన్నారు. మంత్రుల పనితీరు మెరుగు పర్చేందుకే వారికి ర్యాంకులు ఇవ్వడం జరిగిందని ప్రత్తిపాటి అన్నారు.