: అమ్మాయిల హవా... ఏపీ ఇంటర్ ఫలితాల విడుదల


ఆంధ్రప్రదేశ్ ఇంటర్ మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ చరిత్రలోనే తొలిసారిగా, ఒకేసారి రెండు సంవత్సరాల ఫలితాలను అందిస్తున్నామని తెలిపారు. గత నెల 21న చివరి పరీక్ష జరుగగా, నెల రోజులు కాకుండానే ఫలితాలను విడుదల చేశామని అన్నారు. లక్షల మంది విద్యార్థుల ప్రశ్నాపత్రాలను దిద్దేందుకు టెక్నాలజీని వాడుకున్నామని వివరించారు. పరీక్షలను దిద్దడంలో తప్పులు చేసిన 70 మందిని గుర్తించామని, వారికి భవిష్యత్తులో జవాబు పత్రాల మూల్యాంకన బాధ్యతలు అప్పగించబోమని తెలిపారు. తొలి సంవత్సరం పరీక్షలకు 4,67,747 మంది జనరల్ కేటగిరీలో హాజరవగా, ఒకేషనల్ కి 32,655 మంది విద్యార్థులు హాజరైనట్లు మంత్రి తెలిపారు. జనరల్ విభాగంలో 1,85,538 మంది (58.29 శాతం) ఏ గ్రేడులో పాసయ్యారని, 82,109 మంది (25.85 శాతం) బీ గ్రేడ్ లో, 35,592 మంది (11.18 శాతం) సీ గ్రేడ్ లో, 15,061 మంది (4.73 శాతం) డీ గ్రేడ్ లో పాసయ్యారని వివరించారు. మొత్తం 3,18,300 మంది పాసయ్యారని తెలిపారు. పరీక్షలకు హాజరైన వారిలో 68.05 శాతం మంది ఉత్తీర్ణులయ్యారని గంటా పేర్కొన్నారు. అమ్మాయిల్లో 72.09 శాతం, అబ్బాయిల్లో 64.20 శాతం మంది పాసయ్యారని, మాల్ ప్రాక్టీస్ చేసిన 36 మందిని డిబార్ చేశామని, ఎవరి మార్కులనూ విత్ హెల్డ్ లో పెట్టలేదని అన్నారు. రెండవ సంవత్సరం పరీక్షలకు 4,11,941 మంది జనరల్ కేటగిరీలో హాజరవగా, ఒకేషనల్ కి 32,655 మంది విద్యార్థులు హాజరైనట్లు మంత్రి తెలిపారు. జనరల్ విభాగంలో 1,74,649 మంది (57.46 శాతం) ఏ గ్రేడులో పాసయ్యారని, 84,407 మంది (27.77 శాతం) బీ గ్రేడ్ లో, 33,864 మంది (11.14 శాతం) సీ గ్రేడ్ లో, 11,014 మంది (3.62 శాతం) డీ గ్రేడ్ లో పాసయ్యారని వివరించారు. మొత్తం 3,03,934 మంది పాసయ్యారని తెలిపారు. పరీక్షలకు హాజరైన వారిలో 73.78 శాతం మంది ఉత్తీర్ణులయ్యారని గంటా పేర్కొన్నారు. అమ్మాయిల్లో 76.43 శాతం, అబ్బాయిల్లో 71.12 శాతం మంది పాసయ్యారని, మాల్ ప్రాక్టీస్ చేసిన 78 మందిని డిబార్ చేశామని, నలుగురి మార్కులను విత్ హెల్డ్ లో పెట్టామని అన్నారు.

  • Loading...

More Telugu News