: నేను ఆఖరు వాడినా?... మంత్రుల ర్యాంకులన్నీ తప్పు: నారాయణ సంచలన వ్యాఖ్య
నిన్న ప్రకటించిన మంత్రుల ర్యాంకులన్నీ తప్పుడు తడకలని, అవి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించినవి కాదని మంత్రి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఉదయం తుళ్లూరు మండలం వెలగపూడిలో పర్యటించిన ఆయన, తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులను, భవనాల శ్లాబ్ లను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, అసలు ఆ సర్వేలను ఎవరు, ఏ ప్రాతిపదికన తయారు చేశారో తనకు తెలియదని, చిత్తూరు జిల్లా ఇన్ చార్జ్ మంత్రిగా ఐదో ర్యాంకు తనకు రాగా, ఆఖరు ఉన్నట్టు ఎందుకు ప్రకటించారో తెలియడం లేదని అన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం, తాను ఐదో ర్యాంకులో ఉన్నానని తెలిపారు. ఈ నెల 25లోపు అన్ని భవనాల్లోని మొదటి అంతస్తు శ్లాబులను పూర్తి చేస్తామని వివరించారు. ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరించామని, వారానికి 5 రోజుల పనిదినాలకు సీఎం అంగీకరించారని, స్థానికతపై నేడో, రేపో నిర్ణయం వెలువడుతుందని తెలిపారు.