: ‘పనామా’ ఎఫెక్ట్!... అమితాబ్ కు ‘ఇన్ క్రెడిబుల్ ఇండియా’ బ్రాండ్ అంబాసిడర్ హోదా హుళక్కే?


అక్రమార్జనను గుట్టు చప్పుడు కాకుండా విదేశాలకు తరలించి పన్నును ఎగవేసిన భారత నల్ల కుబేరుల జాబితాలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పేరు వెలుగు చూడటం పెను కలకలమే రేపింది. అమితాబ్ తో పాటు ఆయన కోడలు ఐశ్వర్యారాయ్ బచ్చన్ పేరు కూడా ఈ జాబితాలో ఉండటంపై దేశం యావత్తు దిగ్భ్రాంతికి గురైంది. ఈ విషయంలో వారిద్దరికి ఇప్పటిదాకా ఎలాంటి నష్టం వాటిల్లలేదు. అసహనంపై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ మిస్టర్ పెర్ ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్... ‘ఇన్ క్రెడిబుల్ ఇండియా’ బ్రాండ్ అంబాసిడర్ హోదాను కోల్పోయాడు. ఆమిర్ స్థానంలో అమితాబ్ ను ఎంపిక చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చింది. ఈ విషయంలో అధికారిక ప్రకటనే తరువాయి అన్న ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి ఈ నెలలోనే కేంద్రం నుంచి ప్రకటన రావాల్సి ఉంది. అయితే, పనామా పేపర్స్ లో అమితాబ్ పేరు ఉండటంతో ప్రభుత్వం ఇప్పుడు డైలమాలో పడిపోయింది. పనామా పేపర్స్ వెల్లడించినట్లు అమితాబ్ పన్నును ఎగవేసి తన సంపాదనను విదేశాలకు తరలించారా? లేదా? అన్న విషయంపై స్పష్టత వచ్చిన తర్వాతే దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఇప్పటికే ‘ఇన్ క్రెడిబుల్ ఇండియా’ బ్రాండ్ అంబాసిడర్ గా దాదాపుగా ఖరారైన అమితాబ్ పేరును ‘హోల్డ్’లో పెట్టినట్లు కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు చెబుతున్నాయి.

  • Loading...

More Telugu News