: జగన్ మామ కూడా జంపేనా?... బాలినేని పార్టీ మారతారంటూ జోరందుకున్న ప్రచారం
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆయన మామ, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఝలక్కివ్వనున్నట్లు ప్రచారం సాగుతోంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్ లో గనుల శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించిన బాలినేని... వైఎస్ మరణం అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో జగన్ వేరు కుంపటి పెట్టిన తర్వాత తన మంత్రి పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరిపోయారు. అంతేకాకుండా తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసిన ఆయన నాడు జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించి సత్తా చాటారు. అయితే, జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి స్వయానా బావమరిది అయిన బాలినేని... మొన్నటి ఎన్నికల్లో మాత్రం పరాజయం పాలయ్యారు. ఈ క్రమంలో రాజకీయంగానే కాక ఆర్థికంగానూ బక్కచిక్కిన బాలినేనిని ఆదుకునే విషయంలో అటు జగన్ గాని, ఇటు వైవీ సుబ్బారెడ్డి గాని ఆసక్తి చూపలేదన్న ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్న ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేల వెంట బాలినేని కూడా టీడీపీలో చేరడం ఖాయమన్న ప్రచారం ఊపందుకుంది. అయితే బాలినేని యత్నాన్ని నిలువరించే క్రమంలో ఇప్పటికే రంగంలోకి దిగిన జగన్... ఇటీవలే స్వయంగా బాలినేనిని పిలిపించుకుని మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే... ఆ సందర్భంగా వారిద్దరి మధ్య అంత సుహృద్భావ వాతావరణంలో చర్చ జరగలేదని వినికిడి. ఈ క్రమంలో పార్టీ మారేందుకే బాలినేని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ సమాచారం అందుకున్న జగన్... బాలినేనిని నిలువరించే బాధ్యతను తన బంధువర్గానికి అప్పజెప్పినట్లు తెలుస్తోంది.