: స్వార్ధం కోసం చంద్రబాబు 5 కోట్ల మంది ప్రయోజనాలు తాకట్టుపెడుతున్నారు: జగన్
'విభజన సందర్భంగా ప్రత్యేకహోదా అన్నారు. తీరా అడిగితే చట్టంలో లేదు అని అంటున్నారు. ఇదేమి విధానం?' అని వైఎస్సార్సీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. విశాఖపట్టణంలో అమర్ నాథ్ ని పరామర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైల్వేజోన్ అడిగేందుకు ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏంటో తనకు తెలియడం లేదని అన్నారు. ప్రత్యేకహోదా, రైల్వేజోన్, నిధులు, పోలవరం ప్రాజెక్టులపై కేంద్రాన్ని నిలదీసి అడిగితే...చంద్రబాబు ఓటుకు నోటు కుంభకోణాన్ని ఎక్కడ బయటకు తీస్తారోననే భయంతోనే ఆయన కేంద్రాన్ని నిలదీయడం లేదని జగన్ విమర్శించారు. రైల్వే జోన్ వస్తే...నియామకాలు ఏపీ నుంచే ఉంటాయని, 16 విభాగాలకు చెందిన హెడ్ ఆఫీసులు వస్తాయని ఆయన చెప్పారు. ఆపరేషన్స్ విశాఖ నుంచి ప్రారంభమైతే ఉద్యోగావకాశాలు పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కల్పన ఇష్టం లేని చంద్రబాబు, జోన్ అంశాన్ని పట్టించుకోవడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబునాయుడు 5 కోట్ల మంది ప్రజల ప్రయోజనాలు తాకట్టుపెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో రైల్వే ఉద్యోగాల పరీక్షలకు ఒడిశా వెళ్లినప్పుడు మన విద్యార్థులను ఎలా తరిమికొట్టారో అందరికీ తెలిసిందేనని ఆయన గుర్తు చేశారు. దీక్షకు మద్దతు పలికిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా దీక్ష చేస్తున్న అమర్ నాథ్ కి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.