: ‘చంద్రబాబు పొలంలో ఎర్ర డంప్’పై కదిలిన యంత్రాంగం!... నారావారిపల్లెలో ముమ్మరంగా కూంబింగ్!
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సొంతూరు నారావారిపల్లెలో ప్రస్తుతం పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది ముమ్మరంగా కూంబింగ్ జరుపుతున్నారు. నారావారిపల్లెతో పాటు ఆ గ్రామ సమీపంలోని భీమవరం, రంగంపేటల్లోనూ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. చంద్రబాబు సొంత పొలంలో దాచిన ఎర్రచందనం దుంగలు బయటపడ్డ సంగతి తెలిసిందే. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నా పొలంలోనే ఎర్ర డంప్ బయటపడితే... పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు' అంటూ అధికారులకు చీవాట్లు పెట్టారు. ఈ క్రమంలో అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ మిశ్రా ఉన్నపళంగా చిత్తూరు జిల్లాలో వాలిపోయారు. తిరుపతిలో గడచిన రెండు రోజులుగా తిష్ట వేసిన ఆయన నారావారిపల్లె సహా చంద్రగిరి మండలంలోని పలు మండలాలను చుట్టేశారు. మిశ్రా ఆదేశాలతో అటవీ శాఖాధికారులు, పోలీసులు ఆ ప్రాంతాన్ని అంగుళం అంగుళం జల్లెడ పడుతున్నారు. శనివారం రాత్రి ప్రారంభమైన ఈ కూంబింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది.