: నిరుద్యోగులతో తెలుగు ప్రభుత్వాల ఆటలు!


ఐదేళ్ల నాడు జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షలు రాసిన అభ్యర్థులు, తమకు న్యాయం కోసం సంవత్సరాలుగా పోరాటం చేస్తుండగా, వారితో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయి. మరిన్ని వివరాల్లోకి వెళితే... 2011లో గ్రూప్-1 పరీక్ష నిర్వహించగా, అందులో 6 తప్పులున్నాయని, తిరిగి పరీక్ష నిర్వహించాలని అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు, 2013లో తీర్పును వెలువరుస్తూ మరోసారి పరీక్ష పెట్టాలని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పట్టించుకోలేదు. అత్యున్నత న్యాయస్థానం తీర్పును ప్రభుత్వం పెడచెవిన పెట్టి కోర్టు ధిక్కారానికి పాల్పడిందని పరీక్ష రాసిన అభ్యర్థులు మరోసారి కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈలోగా రాష్ట్రం విడిపోగా, కేసు మరో రెండేళ్లు సాగింది. ఈ కేసు నేడు మరోసారి బెంచ్ పైకి రాగా, విభజన తరువాత తమ వాటా పోస్టుల భర్తీకి సిద్ధంగా ఉన్నామని ఏపీ సర్కారు వెల్లడించగా, సమాధానం చెప్పేందుకు రెండు వారాల గడువు కావాలని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. ఈ కేసును మరింత కాలం విచారణ పేరిట సాగదీయరాదని, దానివల్ల ప్రభుత్వాలకే నష్టమని అభిప్రాయపడ్డ ధర్మాసనం, మే 3న పూర్తిస్థాయిలో వాదనలు వింటామని చెబుతూ, కేసు విచారణను వాయిదా వేసింది. ఇక అప్పుడైనా తమకు న్యాయం జరుగుతుందేమోనని నిరుద్యోగులు ఆశతో ఉన్నారు.

  • Loading...

More Telugu News