: పులివెందులలో దొంగల స్వైర విహారం!...‘ఏటీఎం క్యాష్’ సిబ్బందిపై దాడి, రూ.53 లక్షల చోరీ
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంతూరు కడప జిల్లా పులివెందులలో దొంగలు స్వైర విహారం చేశారు. నేటి ఉదయం పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన దొంగలు జనం చూస్తుండగానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన రూ.53 లక్షలను ఎత్తుకెళ్లారు. వివరాల్లోకెళితే... ఎస్ బీఐ ఏటీఎం కేంద్రాల్లో నగదు పెట్టేందుకు ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన సిబ్బంది వాహనంలో బయలుదేరారు. ఈ వాహనం ఆగిన సమయంలో అక్కడికి సమీపంలో మాటు వేసి ఉన్న దొంగలు సిబ్బందిపై మెరుపు దాడి చేశారు. సిబ్బంది షాక్ నుంచి తేరుకునేలోపే వారి వద్దనున్న పెట్టెలు తెరచి అందులోని రూ.53 లక్షలను ఎత్తుకెళ్లారు. ఊహించని ఈ ఘటనలో షాక్ తిన్న సిబ్బంది వెనువెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.