: రేపు ఉదయం 10 గంటలకు ఏపీ ఇంటర్ పరీక్ష ఫలితాలు
రేపు ఉదయం 10 గంటలకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలు ఒకేసారి వెల్లడి కానున్నట్లు సమాచారం. కొద్ది సేపటి క్రితం ఎంసెట్ నిర్వహణపై విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు రేపు ఉదయం 10 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 29న జరిగే ఎంసెట్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని గంటా శ్రీనివాసరావు ఈ సందర్భంగా తెలిపారు. ఎంసెట్‌కు చేతి గడియారాలు అనుమతి లేనందున ప్రతి కేంద్రంలో గోడ గడియారాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. వచ్చే ఏడాది నుంచి ఎంసెట్ పరీక్ష ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని, అన్ని సెట్లు ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో గంటాతో పాటు మంత్రులు కామినేని శ్రీనివాస్, ప్రత్తిపాటి పుల్లారావు, ఏపీ ఎంసెట్ కో ఆర్డినేటర్లు, విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.