: విశాఖ ఫ్లైట్ ఎక్కిన వైఎస్ జగన్... మరికాసేపట్లో అమర్ నాథ్ కు పరామర్శ
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం సాగర నగరం విశాఖకు బయలుదేరారు. హైదరాబాదు శివారులోని శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయంలో విశాఖ ఫ్లైట్ ఎక్కిన జగన్... మరికాసేపట్లో విశాఖకు చేరుకోనున్నారు. రాష్ట్ర విభజన తర్వాత విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చాలా కాలం నుంచి వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే డిమాండ్ తో విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్ నాథ్ నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. నాలుగు రోజుల దీక్ష తర్వాత నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత అమర్ నాథ్ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీక్షలో ఉన్న అమర్ నాథ్ ను బలవంతంగా కేజీహెచ్ కు తరలించారు. ప్రస్తుతం కేజీహెచ్ లోనే ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయనను పరామర్శించేందుకే జగన్ విశాఖ పయనమయ్యారు. విశాఖ చేరుకున్న వెంటనే నేరుగా కేజీహెచ్ వెళ్లనున్న జగన్... అమర్ నాథ్ ను పరామర్శిస్తారు.