: సీఎం పదవిచ్చినా ఫలితం శూన్యం!... పెద్దిరెడ్డి పార్టీ మారరంటున్న చిత్తూరు జిల్లా వైసీపీ చీఫ్
ఏపీలో అధికార టీడీపీ చేపట్టిన ‘ఆకర్ష్’పై విపక్ష వైసీపీ ఎదురు దాడి ప్రారంభించినట్లే కనిపిస్తోంది. పార్టీ నేతలు గోడ దూకకుండా నివారించడంతో పాటు టీడీపీ వ్యూహాలకు ఆదిలోనే చెక్ పెట్టే దిశగా వైసీపీ నేతలు నిన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి... వైసీపీలో ఉన్నంత స్వేచ్ఛ మరే పార్టీలో లేదని వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఏపీలోని చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి కూడా నిన్న తిరుపతి కేంద్రంగా కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీ మారుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏకంగా సీఎం పదవిని ఆఫర్ చేసినా పెద్దిరెడ్డి పార్టీ మారరని నారాయణ స్వామి అన్నారు. పెద్దిరెడ్డిని చిత్తూరు జిల్లా టైగర్ గా అభివర్ణించిన స్వామి... చంద్రబాబు సొంత జిల్లాలో పట్టు సాధించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. పెద్దిరెడ్డిని టీడీపీలోకి లాక్కుంటే తప్పించి చిత్తూరు జిల్లాలో ఆ పార్టీ బలోపేతం కాదని చంద్రబాబు భావిస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే పెద్దిరెడ్డి పార్టీ మారుతున్నారంటూ టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు సూర్యుడు ఇటు పొడిచినా పెద్దిరెడ్డి మాత్రం పార్టీ మారే అవకాశాలే లేవని స్వామి చెప్పారు.