: 'లవ్ జీహాద్' నిరసనల మధ్య హిందూ యువతిని పెళ్లాడిన ముస్లిం యువకుడు
హిందుత్వ సంస్థలు ఓ వైపు నిరసనలు తెలుపుతుంటే, మైసూరులోని ఓ ఫంక్షన్ హాలులో తమ ప్రేయసి అషితను వివాహమాడాడు షకీల్ అహ్మద్. ముస్లింలు, హిందూ యువతులపై 'లవ్ జీహాద్' అస్త్రం ప్రయోగిస్తున్నారని, వారిని వివాహమాడి, మత మార్పిళ్లకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ, మాండ్యా లోని అషిత ఇంటి ముందు ఆందోళనలు జరుగుతున్న వేళ, వీటిని పట్టించుకోని ఆమె తండ్రి నరేంద్ర బాబు, స్వయంగా తన కుమార్తెను వివాహ వేదిక వద్దకు తీసుకెళ్లాడు. తమ కుటుంబాల్లో ఇదొక సంతోషకరమైన రోజని, నిరసనలను పట్టించుకోబోమని అన్నాడు. మాండ్యాలో అషిత, షకీల కుటుంబాలు పక్కపక్కనే ఉండగా, వీరిద్దరూ చిన్నతనం నుంచి కలిసి చదువుకున్నారు. ఆపై వీరి స్నేహం ప్రేమగా మారడంతో, రెండు కుటుంబాలూ పెళ్లికి అంగీకరించాయి. ఈ వివాహాన్ని హిందూ సంస్థలు వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. వారిని తోసిరాజని నిన్న రాత్రి మైసూరులో వీరి వివాహం పోలీసు బందోబస్తు మధ్య వైభవంగా జరిగింది.