: విజయ్ మాల్యాకు విదేశాల్లోనూ చిక్కులే!... యూబీకి బ్యాంకింగ్ సేవలు నిలిపేయనున్న ఆర్బీఎస్


కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ పేరిట విమానయాన సంస్థను నెలకొల్పి విజయ్ మాల్యా చిక్కుల్లో పడ్డారు. అప్పటిదాకా మద్యం తయారీలో భారీ లాభాలతో దర్జాగా బతుకుతున్న మాల్యా ఎయిర్ లైన్స్ వ్యాపారంతో ఒక్కసారిగా రుణ ఎగవేతదారుగా అపఖ్యాతి మూటగట్టుకున్నారు. 17 బ్యాంకుల నుంచి ఆయన తీసుకున్న రుణాలు వడ్డీతో కలుపుకుని రూ.9 వేల కోట్లకు చేరాయి. ఈ అప్పులు చెల్లించలేక ఆయన లండన్ పారిపోయారు. అయితే అక్కడ కూడా ఆయనకు పరిస్థితులు అనుకూలించడం లేదు. కింగ్ ఫిషర్ బీర్లను విశ్వవ్యాప్తంగా విక్రయిస్తున్న కింగ్ ఫిషర్ బీర్ యూరప్ లిమిటెడ్ (కేబీఈఎల్)కు బ్యాంకింగ్ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రపంచ బ్యాంకింగ్ దిగ్గజం ‘రాయల్ బ్యాంక్ ఆప్ స్కాట్లాండ్ (ఆర్బీఎస్)’ ప్రకటించింది. కేబీఈఎల్ నిర్వహణ కోసం యూబీ గ్రూపు పదేళ్ల క్రితం ఆర్బీఎస్ నుంచి 2.8 మిలియన్ డాలర్ల రివాల్వింగ్ రుణాన్ని తీసుకుంది. ప్రస్తుతం ఈ రుణం రూ.5 కోట్లకు పెరిగినట్లు సమాచారం. ఇచ్చిన రుణానికి సంబంధించి కేబీఈఎల్ నుంచి వాయిదాల చెల్లింపులు లేకపోవడంతో ఆర్బీఎస్... ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. కేబీఈఎల్ కు రుణ సదుపాయంతో పాటు బ్యాంకింగ్ సేవలను కూడా నిలిపివేయాలని ఆ బ్యాంకు నిర్ణయించింది. అయితే బ్యాంకు నుంచి నోటీసులు అందుకున్న కేబీఈఎల్ కాస్తంత వేగంగానే స్పందించింది. కనీసం మే నెలాఖరు వరకైనా బ్యాంకింగ్ సేవలను కొనసాగించాలని అభ్యర్థించింది. కేబీఈఎల్ వినతికి సానుకూలంగా స్పందించిన ఆర్బీఎస్...వచ్చే నెల చివరి దాకానే ఆ సంస్థకు బ్యాంకింగ్ సేవలను అందించనుంది. ఆ తర్వాత కేబీఈఎల్ కు ఆర్బీఎస్ సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ఈలోగా కేబీఈఎల్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోని పక్షంలో కింగ్ ఫిషర్ బీరు విక్రయాలపై పెను ప్రభావం పడే ప్రమాదం లేకపోలేదు.

  • Loading...

More Telugu News