: పాక్ హిందువులకు మోదీ వరం!


పాకిస్థాన్ లో మైనారిటీలుగా ఉన్న హిందువులు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్న అంశాలపై నరేంద్ర మోదీ సర్కారు నిర్ణయానికి రానుంది. పాక్ హిందువులు ఇండియాలో ఆస్తులను కొనుగోలు చేసేందుకు, బ్యాంకు ఖాతాలను ప్రారంభించేందుకు, పాన్ కార్డులు, ఆధార్ కార్డులకు దరఖాస్తులు చేసుకునేందుకు వీలును కల్పించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు దీర్ఘకాలం పాటు ఇండియాలో ఉండేందుకు కూడా వీలును కల్పించేలా వారికి వీసాలను ఇవ్వాలని కూడా ప్రణాళికలు రూపొందిస్తోంది. పాక్ హిందువులు ఎవరైనా, ఇండియాకు వచ్చి, ఇక్కడి పౌరులుగా ఉండిపోయేందుకు చేసే దరఖాస్తు ధరను రూ. 15 వేల నుంచి రూ. 100కు తగ్గించాలని కూడా బీజేపీ సర్కారు ఆలోచిస్తున్నట్టు సమాచారం. కాగా, పాక్, బంగ్లాదేశ్, ఆఫ్ఘన్ దేశాలకు చెందిన మైనారిటీలు ఎంతమంది ఇండియాలో ఉన్నారన్న విషయంలో కేంద్రం వద్ద సరైన గణాంకాలు లేవని తెలుస్తోంది. ప్రభుత్వ అంచనాల ప్రకారం, దాదాపు రెండు లక్షల మంది వలస వచ్చి ఇండియాలో స్థిరపడిపోయారు. వీరిలో అత్యధికులు హిందువులు, సిక్కులేనని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. జోధ్ పూర్, జైసల్మేర్, జైపూర్, రాయ్ పూర్, అహ్మదాబాద్, రాజ్ కోట్, కచ్, భోపాల్, ఇండోర్, ముంబై, నాగపూర్, పుణె, ఢిల్లీ, లక్నో తదితర ప్రాంతాల్లో పలువురు పాక్ శరణార్థులు ఉండి ఉండవచ్చని అంచనా. వీరందరికీ ప్రత్యేక హక్కులను కల్పించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉండగా, వాటిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలన్నది మోదీ సర్కారు యోచన.

  • Loading...

More Telugu News