: బీమా కంపెనీల యోచన... దిగుబడి పరిశీలన కోసం డ్రోన్లు!
పంటల బీమాను పెద్దఎత్తున రైతుల్లోకి తీసుకెళ్లాలని నరేంద్ర మోదీ సర్కారు భావిస్తున్న వేళ, ప్రైవేటు రంగంలోని బీమా కంపెనీలు డ్రోన్లను వాడాలని యోచిస్తున్నాయి. పంట దిగుబడి ఎంత వస్తుందన్న విషయమై అంచనా వేసేందుకు డ్రోన్లను ఉపయోగించి వీడియోలు తీసుకునేందుకు అనుమతించాలని వ్యవసాయ మంత్రిత్వ శాఖను కోరుతోంది. మానవరహిత విమానాలను బీమా కంపెనీలు పైలట్ ప్రాజెక్టుగా ఇప్పటికే, వాడుతుండగా అధునాతన సాంకేతికను మరింతగా వినియోగంలోకి తెస్తే, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన మరింత విజయవంతమవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు సైతం భావిస్తున్నారు. అయితే, ఇండియాలో వాణిజ్యపరమైన ఉపయోగాల నిమిత్తం డ్రోన్ల వాడకం అంతగా ప్రాచుర్యంలో లేదు. పైగా స్థానిక ప్రభుత్వాల అనుమతులు తప్పనిసరి. ఈ నేపథ్యంలో బీమా కంపెనీలు డ్రోన్లను వాడాలని భావిస్తున్నప్పటికీ, నిబంధనలు అడ్డుగా నిలుస్తున్నాయి. పంట ఎంత వస్తుందో తెలిస్తేనే, దురదృష్టకర ఘటనలు జరిగిన సమయంలో రైతులు బీమా ఎంత చెల్లించాలన్నది స్పష్టమవుతుందన్నది కంపెనీల వాదన. వస్తుందనుకున్న దిగుబడిపై రబీ సీజనులో 1.5 శాతం, ఖరీఫ్ సీజనుకు 2.0 శాతం ప్రీమియంను రైతులు చెల్లించాల్సి వుంటుంది. అంటే, ఖరీఫ్ లో ఎకరానికి రూ. లక్ష రాబడి వుంటుందని భావిస్తే, బీమా కోసం రూ. 2 వేలు చెల్లించాల్సి వుంటుంది. ఈ సంవత్సరం పంటల బీమా నిమిత్తం రూ. 5,500 కోట్లు ఖర్చు పెట్టాలని మోదీ సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. నామమాత్రపు ప్రీమియంతోనే పంటల బీమాను దగ్గర చేస్తామని బడ్జెట్ ప్రతిపాదనల్లో భాగంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రతిపాదించారు. ఇక డ్రోన్ల వాడకానికి కూడా అనుమతి లభిస్తే, రైతులకే ప్రయోజనమని హెచ్డీఎఫ్సీ ఈఆర్జీవో జనరల్ ఇన్స్యూరెన్స్ మేనేజ్ మెంట్ సభ్యుడు అనుజ్ త్యాగి వ్యాఖ్యానించారు. రాజస్థాన్ లో డ్రోన్ల సమాచారం, శాటిలైట్లు అందించిన చిత్రాల నుంచి సేకరించిన డేటా తమకు సంతృప్తిని ఇచ్చాయని వివరించారు. అన్ని రాష్ట్రాల్లో డ్రోన్ల వాడకంపై అనుమతించాలని కోరారు.