: జగ్గంపేట టీడీపీలో మూడు గ్రూపులు... కొత్త రాజకీయాలు!


తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట రాజకీయాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. నియోజకవర్గంలోని ప్రధాన నేతలంతా ఒకే పార్టీలో ఉండటంతో, వారి మధ్య నామినేటెడ్ పదవుల విషయమై ఏకాభిప్రాయం రావడం లేదని తెలుస్తోంది. మొత్తం మూడు గ్రూపులుగా నేతలుండగా, ఎవరి మాట వినాలన్నది చంద్రబాబుకు కొత్త తలనొప్పులను తెచ్చి పెట్టేలా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న జ్యోతుల నెహ్రూ ఇటీవల వైకాపా నుంచి తెలుగుదేశంలో చేరడం, ఈ ప్రాంతంలోని తెలుగుదేశం నేతలకు మింగుడుపడని విషయంగా మారిందని సమాచారం. గతంలో జ్యోతుల తెలుగుదేశం పార్టీలో ఉన్న సమయంలో, ప్రస్తుత కాకినాడ పార్లమెంట్ సభ్యుడు తోట నరసింహం కాంగ్రెస్ పార్టీలో ఉన్న సంగతి తెలిసిందే. గతంలో జ్యోతుల, తోట కుటుంబాల మధ్య రాజకీయ పోరాటం జరుగుతుండేది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తరువాత తెలుగుదేశం నుంచి ప్రజారాజ్యంలోకి ఫిరాయించిన జ్యోతుల నెహ్రూ, ఆపై వైకాపాలో చేరి ఎమ్మెల్యేగా విజయం సాధించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో కాంగ్రెస్ లో ఉన్న తోట నరసింహం, టీడీపీలో చేరి ఎంపీగా గెలిచారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే, జ్యోతుల వైకాపా చేరికను వ్యతిరేకించిన, ఆయన బంధువు జ్యోతుల చంటిబాబు, తెలుగుదేశంలో చేరి, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నెహ్రూపై పోటీ పడి ఓడిపోయారు. జగ్గంపేటలో ఇప్పుడు ఈ ముగ్గురివీ మూడు గ్రూపులు. నిన్నమొన్నటి వరకూ చంటిబాబు, నరసింహం వర్గాల మధ్య ఆధిపత్య పోరు సాగుతుంటే, తాజాగా నెహ్రూ వర్గం కూడా వచ్చి చేరింది. ఇక ఈ మూడు వర్గాల మధ్యా కొనసాగుతున్న కుమ్ములాటలకు చంద్రబాబు ఎలా చెక్ పెట్టి, పార్టీని ముందుకు నడిపిస్తారన్నది ఆసక్తిగా మారింది.

  • Loading...

More Telugu News