: లేబర్ సర్వే చెబుతున్న పచ్చి నిజం... ఇండియాలో ఉద్యోగ వృద్ధి ఏడేళ్ల కనిష్ఠానికి!
ఇండియాలోని జెమ్స్ అండ్ జ్యూయెలరీ, హ్యాండ్ లూమ్, ఆటో, లెదర్ రంగాలు సహా ఎనిమిది ముఖ్యమైన సెక్టార్లలో ఉద్యోగ వృద్ధి ఏడేళ్ల కనిష్ఠానికి దిగజారింది. 2015లో ఈ రంగాల్లో కేవలం 1.35 లక్షల ఉద్యోగాలు మాత్రమే వచ్చాయని, 2009 తరువాత ఇదే అతి తక్కువని లేబర్ బ్యూరో విడుదల చేసిన రిపోర్టు వెల్లడించింది. అంతకుముందు 2014లో 4.21 లక్షలు, 2013లో 4.19 లక్షలు, 2012లో 3.21 లక్షలు, 2011లో 9.29 లక్షలు, 2010లో 8.7 లక్షలు, 2009లో 12.8 లక్షల మందికి కొత్త ఉద్యోగాలు లభించాయని, ఆ స్థాయిలో ఉద్యోగాలను సృష్టించడంలో 2015 విఫలమైందని తెలిపింది. అక్టోబర్ - డిసెంబర్ మధ్య కాలంలో 20 వేల మందిని విధుల నుంచి తొలగించారని, ఏప్రిల్ - జూన్ తో పోలిస్తే జూలై - సెప్టెంబర్ లో అధిక ఉద్యోగాలు వచ్చాయని పేర్కొంది. అపెరల్, రవాణా, ఐటీ/బీపీఓ, లోహ రంగాల్లో కొత్త ఉద్యోగాలు ఇవ్వడం తగ్గిపోయిందని కార్మిక మంత్రిత్వ శాఖా విభాగంగా ఉన్న లేబర్ బ్యూరో, 2009 నుంచి ప్రపంచ ఆర్థిక మాంద్యం ఇండియాపై చూపుతున్న ప్రభావం గురించిన అధ్యయనాలను చేస్తున్న సంగతి తెలిసిందే. 2015లో జెమ్స్ అండ్ జ్యూయలరీ రంగంలో 19 వేల మంది, హ్యాండ్ లూమ్, పవర్ లూమ్ రంగాల్లో 11 వేల మంది, తోళ్ల పరిశ్రమలో 8 వేల మంది, వాహన రంగంలో 8 వేల మంది, రవాణా రంగంలో 4 వేల మంది ఉద్యోగాలను కోల్పోయారని ఈ నివేదిక వెల్లడించింది.