: మసీదుల్లోకి ముస్లిం మహిళలనూ వెళ్లనివ్వాలి: మరో వివాదాన్ని రేపిన సాక్షీ మహరాజ్
నిత్యమూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేస్తూ, వార్తల్లో నిలిచివుండే బీజేపీ ఎంపీ సాక్షీ మహరాజ్, ఈదఫా ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నారు. హిందూ దేవాలయాల గర్భగుడుల్లోకి మహిళలను అనుమతిస్తున్నట్టే, మసీదుల్లో నమాజు చేసుకోవడానికి ముస్లిం స్త్రీలనూ అనుమతించాలని డిమాండ్ చేశారు. "ఇస్లాం విషయాల్లో భారత న్యాయ వ్యవస్థ కల్పించుకోవాలి. ముస్లిం మహిళలు మాకు తల్లులు, సోదరులు. వారికి ప్రార్థనల విషయంలో అన్యాయం జరుగుతోంది. వారిని నమాజు చేసుకునేందుకు మసీదుల్లోకి అనుమతించాలి. హిందువుల సంప్రదాయాల్లోకి తలదూరుస్తున్నట్టే ముస్లిం సంప్రదాయాల్లోకి కోర్టులు ప్రవేశించి ఈ మేరకు ఆదేశాలివ్వాలి" అంటూ కొత్త వివాదాన్ని రేపారు. రాజ్యాంగం ప్రకారమే దేశం నడవాలిగానీ, ఫత్వాల ప్రకారం కాదని ఆయన అన్నారు. భారత న్యాయస్థానాలు ఈ విషయంలో వెంటనే కల్పించుకోవాలని అన్నారు. కాగా, ఇటీవల బాంబే హైకోర్టు మహిళలు దేవాలయాల గర్భగుడుల్లోకి ప్రవేశించి విగ్రహాలకు పూజలు చేసేందుకు ఏ చట్టమూ వ్యతిరేకం కాదని తీర్పిచ్చిన సంగతి తెలిసిందే.