: ప్రియాంకా గాంధీ పొదుపు సూత్రం!... వాజ్ పేయి సర్కారుతో బేరమాడి అద్దె తగ్గించుకున్న వైనం


ప్రియాంకా వాద్రా... వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాను పెళ్లాడిన తర్వాత ఇంటిపేరు వాద్రాగా మారిపోయింది గాని, ఇందిరా గాంధీ మనవరాలిగా భవిష్యత్తు రాజకీయాల్లో చక్రం తిప్పే సత్తా ఉన్న యువతిగా విశేష ప్రజాదరణ పొందిన మహిళ. రాజకీయాల్లోకి అయితే రాలేదు కాని... నానమ్మ, తండ్రి రాజీవ్ గాంధీలకు కొనసాగిన ఎస్పీజీ భద్రత ఛత్రం కింద ఉన్న ఆమె మహా పిసినారి అని తేలిపోయింది. అంతేకాదండోయ్... బేరమాడటంలోనూ ఆమె తనకు తానే సాటి అని కూడా నిరూపించుకున్నారు. రాజకీయంగా ప్రత్యర్థి పార్టీ బీజేపీ అధికారంలో ఉండగా, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి సర్కారుతో బేరమాడిన ఆమె తానుంటున్న విలాసవంతమైన భవంతి అద్దెను నేలకు దించారు. అంతేకాదు, ఆమె బేరం విజయవంతమైన నేపథ్యంలో ఆమె ఇరుగు పొరుగు బంగ్లాల్లో ఉంటున్న రాజకీయ నేతలకు కూడ అద్దె తగ్గిపోయింది. ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లింది. అసలు విషయమేమిటంటే... 2002లో ఢిల్లీలోని లుటియెన్స్ బంగ్లాల్లోని ఓ భవంతిలో భర్తతో కలిసి నివాసమున్న ప్రియాంక అద్దె చెల్లింపుల్లో మాత్రం బేరమాడింది. 2,765 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న భవంతిలో ఆమె నివాసముండేది. సదరు భవంతి అద్దెను రూ.53,421గా ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటిదాకా సదరు అద్దెను ఆ తరహా భవంతుల్లో ఉన్న రాజకీయ ప్రముఖులు చెల్లించారు కూడా. అయితే సదరు భవంతిలోకి మారిన తర్వాత ప్రియాంక, వాజ్ పేయి సర్కారుకు ఓ లేఖ రాస్తూ, రూ.53,421ల అద్దె అనేది చాలా ఎక్కువని, అంత మొత్తం చెల్లించే స్థాయి తనకు లేదని పేర్కొన్నారు. సాక్షాత్తు ఇందిరా గాంధీ మనవరాలు రాసిన లేఖకు వాజ్ పేయి సర్కారు కూడా నిజమేనేమోనని నమ్మింది. రూ.53,421 అద్దెను అమాంతంగా రూ.8,888కి తగ్గించింది. అద్దె తగ్గింపు కోరుతూ రాసిన లేఖలో ప్రియాంక పలు ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు. తాను ఎస్పీజీ భద్రతలో ఉంటున్నానని, ఆ భవంతిలో మెజారిటీ భాగం ఎస్పీజీ సిబ్బందే వినియోగిస్తున్నారని ఆమె సరికొత్త వాదన చేసింది. ఏదో ఓ మూలకు తన కుటుంబం నివాసం ఉంటోందని ప్రియాంక పేర్కొంది. ఇక ప్రియాంకకు అద్దెలో తగ్గింపును ప్రకటించిన వాజ్ పేయి సర్కారు ఆ తరహా భవంతుల్లో ఉన్న రాజకీయ ప్రముఖుల అద్దెలను కూడా తగ్గించాల్సి వచ్చింది. ఈ మేరకు ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ నేటి తన సంచికలో ఆసక్తికర కథనాన్ని రాసింది.

  • Loading...

More Telugu News