: కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారు!...ముంపు గ్రామాల బదలాయింపు ఒట్టిమాటే: దేవినేని ఉమ


పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ముంపు గ్రామాల బదలాయింపుపై తెలంగాణ సీఎం కేసీఆర్ అవాస్తవాలు చెబుతున్నారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ముంపు మండలాల్లోని ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణకు బదలాయించేందుకు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తమకు హామీ ఇచ్చారని గతంలో ఓసారి చెప్పిన కేసీఆర్... నిన్న మరోసారి ఇదే అంశాన్ని ప్రస్తావించారు. నేటి ఉదయం విజయవాడలో ఓ ప్రైవేట్ న్యూస్ చానెల్ తో మాట్లాడిన సందర్భంగా దేవినేని... కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణలోని కొన్ని మండలాలు ఏపీలో కలిశాయని దేవినేని చెప్పారు. ఈ ముంపు మండలాలు ఏపీ పరిధిలో ఉంటేనే ప్రాజెక్టును పూర్తి చేయడంతో పాటు పునరావాస కార్యక్రమాలు సంపూర్ణమవుతాయని దేవినేని చెప్పారు. ఐదు గ్రామాలను తెలంగాణకు బదలాయించేందుకు చంద్రబాబు హామీ ఇచ్చారని కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి హామీని చంద్రబాబు ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. చట్టప్రకారం తెలంగాణ నుంచి ఏపీలో కలిసిన ఏ ఒక్క గ్రామాన్ని కూడా తెలంగాణకు బదలాయించేది లేదని కూడా దేవినేని తేల్చిచెప్పారు.

  • Loading...

More Telugu News