: ర్యాష్ డ్రైవింగ్ ఆరోపణపై కేంద్ర మంత్రి సుజనా కొడుకుపై కేసు


టీడీపీ సీనియర్ నేత, కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి చిక్కుల్లో పడ్డారు. నిన్న రాత్రి హైదరాబాదులో ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న ఆయన కొడుకు కార్తీక్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత కొంతమంది మిత్రులతో కలిసి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద ప్రత్యక్షమైన కార్తీక్... పంజాగుట్టకు దారి తీసే రోడ్డు మీదుగా కారు రేసింగులకు దిగినట్లు సమాచారం. ఈ రేసింగుల్లో సుజనా యూనివర్సల్ పేరిట రిజిస్టర్ అయిన ‘ఏపీ 09 సీవీ 9699’ కారుతో కార్తీక్ అక్కడికి రాగా... మరో మూడు కార్లు, పది బైకులపై అతడి మిత్రులు వచ్చారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత నడిరోడ్లపై 100 నుంచి 150 కిలో మీటర్ల వేగంతో రయ్యిమంటూ దూసుకెళుతున్న కార్లను చూసిన నగర వాసులు బెంబేలెత్తిపోయారు. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన ఎస్ ఆర్ నగర్, మహంకాళీ స్టేషన్ పోలీసులు మెరుపు దాడి చేసి కార్తీక్ సహా మిగిలిన వారిని అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో కార్తీక్ పై ర్యాష్ డ్రైవింగ్ ఆరోపణ కింద కేసు నమోదు చేశారు. ఈ ఆరోపణల కింద బుక్కయ్యే నిందితులకు కౌన్సిలింగ్ నిర్వహించిన తర్వాత పోలీసులు వదిలేస్తున్నారు. దీంతో సుజనా కొడుకు కార్తీక్ కు కూడా నేటి ఉదయం కౌన్సిలింగ్ నిర్విహించి వదిలేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

  • Loading...

More Telugu News