: రైల్వేజోన్ ఆందోళనలో వైఎస్సార్సీపీ నేత...టీడీపీకి కొత్త ఇబ్బంది
కాపు రిజర్వేషన్ ఉద్యమంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న టీడీపీ ప్రభుత్వానికి విశాఖ రైల్వే జోన్ కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఈ మధ్య కాలంలో విశాఖ రైల్వే జోన్ అంశం ప్రజాకాంక్ష కాదని, కేవలం రాజకీయ నిర్ణయం మాత్రమేనని విశాఖ బీజేపీ నేతలు పేర్కొంటూ వస్తున్నారు. ప్రత్యేకహోదా ఏపీ హక్కు అని అధికారం చేపట్టకముందు పేర్కొన్న టీడీపీ మిత్రపక్షాలు, అధికారం చేపట్టిన వెంటనే ప్రత్యేకహోదా కంటే ఎక్కువ ప్రయోజనాలు కలిగేలా ప్రత్యేక ప్యాకేజీ వస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రత్యేకప్యాకేజీ ఎలా ఉంటుందో తెలియని ఏపీ ప్రజలు...తాజాగా విశాఖ రైల్వే జోన్ పై గళం ఎత్తారు. దీంతో వైసీపీ నేత గుడివాడ అమరనాథ్ రైల్వే జోన్ సాధన కోసం దీక్ష చేపట్టారు. ఇది రెండో రోజుకు చేరుకుంది. అసలు దీక్షకు అనుమతి ఎలా ఇచ్చారని ముఖ్యమంత్రి జిల్లా నేతలను ప్రశ్నించినట్టు వార్తలు వెలువడ్డ సంగతి తెలిసిందే. దీంతో సమస్య తీవ్రత గుర్తించిన వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విశాఖలో వాలిపోయారు. అమరనాథ్ చేపట్టిన దీక్షకు ఆయన మద్దతు పలికారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీకి విలువలేకపోతే ఎలా? అంటూ ఆయన విమర్శలు ఎక్కుపెట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారని ఆయన విమర్శించారు. కేవలం 200 కోట్లరూపాయలతో పోలవరం ప్రాజెక్టును 2018 నాటికి ఎలా పూర్తి చేస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రానున్న పార్లమెంటు సమావేశాల్లో ప్రత్యేకహోదా, పోలవరం ప్రాజెక్టుపై కేంద్రాన్ని నిలదీస్తామని ఆయన పేర్కొన్నారు. దీంతో టీడీపీ నేతల్లో ఆందోళన నెలకొంది. ఈ ఉద్యమం తీవ్ర రూపం దాల్చితే...టీడీపీ మరోసారి ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది.