: జేఎన్యూ బస్సులో తుపాకి లభ్యం... కన్నయ్య కుమార్ ను హత్య చేస్తామంటూ లేఖ
జేఎన్యూ విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్ కు పేరు ప్రతిష్ఠలు పెరుగుతున్న కొద్దీ, ఆయనకు కష్టాలు కూడా పెరుగుతున్నాయి. ఢిల్లీలోని కాశ్మీరీ గేట్ నుంచి జేఎన్యూ మధ్య నడిచే బస్సులో అనుమానాస్పద బ్యాగును గుర్తించిన డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దానిని తనిఖీ చేసిన పోలీసులు, అందులో తుపాకీని, ఒక లేఖను గుర్తించారు. ఈ లేఖలో కన్నయ్య కుమార్, ఉమర్ ఖలీద్ లను హత్యచేస్తామని పేర్కొనడం కలకలం రేగుతోంది. దీంతో పోలీసులు పలువురిని ప్రశ్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. కాగా, తమ వ్యక్తులు జేఎన్యూలో ఉన్నారని, అదను చూసి కన్నయ్య కుమార్ ను చంపేస్తామంటూ ఫేస్ బుక్ ద్వారా గతంలో ఓ వ్యక్తి బెదిరించిన సంగతి తెలిసిందే. తాజా లేఖతో వారిద్దరికీ భద్రతను పెంచారు.