: ఇక ఇఫ్లూ వంతు!... దళిత రీసెర్చి స్కాలర్ పై బహిష్కరణ వేటు!


మొన్న హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ... నిన్న ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం... తాజాగా హైదరాబాదులోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)... దళిత విద్యార్థుల బహిష్కరణలతో వివాదాల్లో చిక్కుకున్నాయి. తొలి రెండు ఘటనలు యావత్తు దేశాన్ని కుదిపేశాయి. తాజాగా ఇప్లూలో చోటుచేసుకున్న ఘటన కూడా పెద్ద దుమారాన్నే రేపనుంది. వివరాల్లోకెళితే... ఇఫ్లూలో రీసెర్చి స్కాలర్ గా కొనసాగుతున్న ఢిల్లీకి చెందిన దళిత విద్యార్థి కునాల్ దుగ్గల్ పై నిన్న సస్పెన్షన్ వేటు పడింది. కునాల్ దుగ్గల్ విద్రోహ చర్యలకు పాల్పడిన కారణంగానే అతడిని బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నామని వర్సిటీ అధికారులు చెబుతుండగా, అంబేద్కర్ జయంతి రోజున ఏర్పాటైన కార్యక్రమంలో ఓ పాట పాడి ప్రసంగించిన కారణంగానే తనను బహిష్కరించారని కునాల్ ఆరోపిస్తున్నాడు. కునాల్ వాదన ప్రకారం... నిన్న వర్సిటీ ప్రాంగణంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటైన వేదికపై ఓ పాట పాడిన అతడు కీలక ప్రసంగం చేశాడు. అతడి ప్రసంగం పూర్తి కాగానే, అక్కడికొచ్చిన సెక్యూరిటీ గార్డులు అతడిని బలవంతంగా వేదిక కిందకు ఈడ్చేసి, చీఫ్ సెక్యూరిటీ గార్డు వద్దకు లాక్కుపోయారు. కారణమేమీ చెప్పకుండానే అతడిని క్యాంపస్ నుంచి బహిష్కరిస్తున్నట్టు చీఫ్ సెక్యూరిటీ గార్డు చెప్పారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కునాల్ అక్కడికి సమీపంలోని ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో ఇఫ్లూ అధికారులపై ఫిర్యాదు చేశారు. హెచ్ సీయూ రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య నేపథ్యంలో అక్కడ జరుగుతున్న ఉద్యమాల్లో కునాల్ చురుకుగా పాల్గొంటున్నాడు. ఇఫ్లూలో రీసెర్చి స్కాలర్ గా ఉంటున్న కునాల్... హెచ్ సీయూలో గెస్ట్ ఫ్యాకల్టీగానూ పనిచేస్తున్నారు. ఇక ఓయూ పోలీసులు తెలిపిన వివరాల విషయానికొస్తే... కునాల్ దుగ్గల్ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడ్డాడని సెక్యూరిటీ గార్డులు ఫిర్యాదు చేశారు. అకారణంగానే తనను బహిష్కరించారని కునాల్ ఫిర్యాదు చేశారు. ఇరు వర్గాల ఫిర్యాదులను స్వీకరించిన ఓయూ పోలీసులు రెండింటిపై విచారణ చేపట్టారు.

  • Loading...

More Telugu News