: భద్రాద్రిలో ముగిసిన కల్యాణం... గ్రామగ్రామానా నవమి సంబరాలు
భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తుల జయజయధ్వానాల మధ్య, పూజారులు వివాహ తంతును పూర్తి చేయగా, తెలుగు రాష్ట్రాల్లోని వేలాది ప్రాంతాల్లో సీతారాముల కల్యాణాలు సంబరంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రాల్లో మంత్రులు, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఎంతోమంది ప్రజలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఒంగోలులో జరిగిన వేడుకల్లో మంత్రి శిద్ధా రాఘవరావు, తూర్పు గోదావరిలో తోట త్రిమూర్తులు, అనంతపురం జిల్లాలోని శ్రీహరిపురంలో పరిటాల సునీత, నీటిపారుదల శాఖ కార్యాలయంలో జరిగిన కల్యాణం వేడుకల్లో దేవినేని ఉమ పాల్గొన్నారు. ఒంటిమిట్టలోని కోదండ రామాలయంలో ఈ ఉదయం ధ్వజారోహణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాగా, మంత్రి గంటా శ్రీనివాసరావు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. హైదరాబాద్, కర్నూలు తదితర ప్రాంతాల్లో హిందూ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో శోభాయాత్రలు ప్రారంభమయ్యాయి. కర్నూలులో గట్టి బందోబస్తు మధ్య వీహెచ్పీ ఏర్పాటు చేసిన శోభాయాత్రలో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. హైదరాబాద్ లో శోభాయాత్ర మరికాసేపట్లో ప్రారంభం కానుంది.