: త్వరలో మరిన్ని శుభవార్తలు: ఆర్బీఐ గవర్నర్ రాజన్
ప్రస్తుత వర్షాకాల సీజనులో సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ వేసిన అంచనాలకు తోడు, ద్రవ్యోల్బణం తగ్గడం, ఐఐపీ పెరగడం వంటి అంశాలు స్టాక్ మార్కెట్ బుల్ హైజంప్ చేయడానికి సహకరించిన వేళ, ఇన్వెస్టర్ల సెంటిమెంటును నిలిపివుంచేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురాం రాజన్ తీపి కబురు చెప్పారు. ద్రవ్యోల్బణం ఇలాగే కొనసాగితే, కీలక రేట్లు మరింతగా తగ్గుతాయని తెలిపారు. "మేము ఇన్ ఫ్లేషన్ ను నిశితంగా గమనిస్తున్నాం. గత కొంత కాలంగా తగ్గుతూ వస్తున్న గణాంకాలు, అదే దారిలో పయనిస్తే, మరింతగా రెపో రేటును తగ్గించే సౌలభ్యం కలుగుతుంది" అని రాజన్ వ్యాఖ్యానించారు. కాగా, ఈ నెల ప్రారంభంళో ఆర్బీఐ రెపో రేటును పావు శాతం తగ్గించిన సంగతి తెలిసిందే. ఆరు నెలల తరువాత రెపో రేటు తగ్గడం, ఆపై సానుకూలాంశాలు తోడు కావడంతో మార్కెట్లు ముందుకు దూకాయి. "ఇండియాలో మంచి రుతుపవనాలు వస్తాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే, దురదృష్టకర విషయం ఏంటంటే మంచి వర్షాలు పడి పంటలు పండినా, సరైన ధర రావడం లేదని రైతులు, ఆహార ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. వరుసగా రెండేళ్లు కరవు పీడించడమే ఇందుకు కారణం" అని వాల్ స్ట్రీట్ జర్నల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజన్ తెలిపారు. తమకు అవకాశం లభించినప్పుడల్లా వడ్డీ రేట్లను తగ్గించేందుకే ప్రయత్నిస్తామని ఆయన అన్నారు. తదుపరి పరపతి సమీక్ష నాటికి తొలకరి వర్షాలు కురవనున్నాయని, ఆ సమయానికి ద్రవ్యోల్బణం గణాంకాలను పరిశీలించి రెపో రేటుపై నిర్ణయిం తీసుకుంటామని అన్నారు.