: విజయసాయిరెడ్డికి రాజ్యసభ సీటు దక్కేనా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆర్థిక వ్యవహారాల నిర్వహణ బాధ్యత మొత్తం ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొత్త బాధ్యతలు చేపట్టిన ప్రముఖ ఆడిటర్ విజయసాయిరెడ్డిదే. ఈ కారణంగానే జగన్ పై నమోదైన అక్రమాస్తుల కేసుల్లో విజయసాయి రెండో నిందితుడు (ఏ2)గా ఉన్నారు. అప్పటిదాకా రాజకీయాల్లో ఏమాత్రం అనుభవం లేని విజయసాయి... జగన్ పార్టీ పెట్టిన తర్వాత రాజకీయ తెరంగేట్రం చేశారు. ఈ క్రమంలో విజయసాయిని రాజ్యసభకు పంపుతానని ఇదివరకే జగన్ ప్రకటించారు. అయితే విజయసాయికి రాజ్యసభ సభ్యత్వం దక్కుతుందా? అన్న అనుమానాలు రేకెత్తున్నాయి. ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్నట్లు... వైసీపీకి హ్యాండిచ్చి టీడీపీలోకి చేరుతున్న ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతున్న కొద్దీ విజయసాయికి రాజ్యసభ సీటు దక్కే అవకాశాలు తగ్గిపోతున్నాయి. త్వరలో రాజ్యసభకు జరగనున్న ద్వైవార్షిక ఎన్నికల్లో ఏపీకి నాలుగు సీట్లు దక్కనున్నాయి. ఈ క్రమంలో విపక్ష వైసీపీకి ఓ సీటు ఖాయంగా దక్కే అవకాశాలున్నాయి. రాజ్యసభ సీటు దక్కాలంటే 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. గడచిన ఎన్నికల్లో వైసీపీ 67 సీట్లను దక్కించుకుంది. ఇప్పటిదాకా ఆ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు టీడీపీ కండువా కప్పుకున్నారు. దీంతో ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య 56కు తగ్గింది. ఈ బలం ఇలాగే ఉంటే, విజయసాయి తప్పనిసరిగా రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడం ఖాయమే. అయితే విజయనగరం జిల్లాలో ఆ పార్టీకి ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు దాదాపుగా రంగం సిద్ధమైంది. అదే సమయంలో ప్రకాశం జిల్లాలోనూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో వైసీపీ నుంచి ఏకంగా 25 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరనున్నట్లు రాజకీయ పరిశీలకులు లెక్కలు కడుతున్నారు. ఇదే జరిగితే... విజయసాయి ‘రాజ్యసభ’ కలలు కల్లలుగానే మారక తప్పదన్న వాదన వినిపిస్తోంది. ఎమ్మెల్యేల సంఖ్య 44 కంటే ఎక్కువగా ఉంటే ఫరవా లేదు కాని, అంతకంటే ఏ ఒక్కటి తగ్గినా... విజయసాయి రాజ్యసభకు వెళ్లడం దుర్లభమే. ఈ కారణంగానే పార్టీ మారతారంటూ ప్రచారంలోకి వస్తున్న ఎమ్మెల్యేల వద్దకు విజయసాయి పరుగులు పెడుతున్నారట.