: భద్రాద్రి పెళ్లి సందడిలో మండపేట కొబ్బరి బొండాలు!
శ్రీరామనవమి సందర్భంగా ఖమ్మం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో రాములోరి కల్యాణం కనువిందుగా జరగనుంది. నేటి తెల్లవారుజాము నుంచే ఆలయంలో పెళ్లి సందడి మొదలైంది. నేటి మధ్యాహ్నం జరగనున్న సీతారాముల కల్యాణాన్ని తిలకించేందుకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో భక్తులు భద్రాద్రి చేరుకున్నారు. పెళ్లి క్రతువులో భాగంగా సీతారాముల వద్ద కనువిందు చేసేందుకు మూడు కొబ్బరి బొండాలు తూర్పు గోదావరి జిల్లా మండపేట నుంచి తరలివచ్చాయి. మండపేటకు చెందిన కాజూలూరి అచ్యుత వెంకటరామారెడ్డి ఈ కొబ్బరి బొండాలను పంపారు. 2001 నుంచి ఏటా భద్రాద్రి రాములోరి కల్యాణానికి కొబ్బరి బొండాలు పంపుతున్న రామారెడ్డి... ఈ ఏడాది కూడా ఆనవాయతీ ప్రకారం బొండాలను పంపారు. రాములోరి కల్యాణానికి వినియోగించే ఈ కొబ్బరి బొండాల సేకరణ, అలంకరణకు రామారెడ్డికి 15 రోజుల సమయం పట్టిందట. కొబ్బరి బొండాలతో పాటు కర్పూర దండలను కూడా ఆయన భద్రాద్రికి పంపారు.