: యూనివర్సీటీల్లో దళితులను హత్య చేస్తూ...ఎందుకీ మోసం: మోదీకి నితీష్ చురక
ఒకవైపు యూనివర్సీటీల్లో దళిత విద్యార్థులు వేధింపులకు గురవుతున్నారని, వాటిని తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. పట్నాలో ఆయన మాట్లాడుతూ, అలాంటి వారిని పట్టించుకోకుండా దళితుల ఓట్ల కోసం కొంత మంది వారిపై కపట ప్రేమను నటిస్తున్నారని విమర్శించారు. బలహీన వర్గాల ఓట్లు దండుకోవడానికే అంబేద్కర్ పేరుతో మోదీ ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్తోందని ఆయన విమర్శించారు. అంబేద్కర్ సిద్ధాంతాలపై ఏమాత్రం విశ్వాసం లేనివారు ఆయన జయంతులు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అంబేద్కర్ సామాజిక అసమానతలను రూపుమాపేందుకు అవిశ్రాంత పోరాటం చేశారని ఆయన గుర్తు చేశారు. బీజేపీ స్వార్థ ప్రయోజనాల కోసం దేశ ప్రజల్లో మతం పేరుతో విద్వేషాలు రేపే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఏమాత్రం పాత్రలేని వారు జాతీయ వాదం గురించి విపరీతంగా మాట్లాడుతున్నారని ఆయన మోదీకి చురకలు అంటించారు.